స్టాక్ మార్కెట్లో రాణించాలనుకునే వారు ప్రాథమిక స్టాక్ మార్కెట్ నిబంధనల (Fundamental Stock Market Terms) పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ బిగినర్స్‌కు కొన్ని పదాలను అర్థం చేసుకోవడం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో తరచూ వాడే పదాలు వాటి అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.
షేర్ (Share): షేరును ఈక్విటీ షేరు అనికూడా పిలుస్తారు. కంపెనీల విలువను షేర్ల ఆధారంగా విభజిస్తారు. మీరు ఏదైనా కంపెనీకి సంబంధించిన షేర్లు కొనుగోలు చేసినట్లయితే ఆ కంపెనీకి సంబంధించిన పాక్షిక యాజమాన్య హక్కులు మీకు కల్పించబడతాయి. ఆ హక్కులతో మీరు కంపెనీ జనరల్ మీటింగ్స్‌లో VOTE వేసే వీలుంటుంది. ఇదే సమయంలో కంపెనీ ఆర్జించే లాభాల్లో కూడా మీ షేర్లకు అనుగుణంగా లాభం జమ చేయబడతుంది.

బిడ్ (Bid): స్టాక్ మార్కెట్లో షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్ చెల్లించాలనుకుంటున్న అత్యధిక ధరనే ‘బిడ్’ అని పిలుస్తారు.
ఆస్క్ (Ask): షేర్ హోల్డర్లు తాము విక్రయించాలనుకుంటున్న షేర్లకు ఓ ధరను నిర్దేశించటాన్నే ‘ఆస్క్’ అని పిలుస్తారు.
బ్రోకర్ (Broker): స్టాక్ మార్కెట్లో బ్రోకర్‌ను స్టాక్ బ్రోకర్ అని పిలుస్తారు. ట్రేడింగ్ చేసేందుకు అవసరమైన ప్లాట్‌ఫామ్‌ను స్టాక్ బ్రోకరేజీ సంస్థలు ప్రొవైడ్ చేస్తాయి. షేర్లకు సంబంధించిన క్రయ విక్రయాలను ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి చేయవచ్చు. ఈ సదుపాయాన్ని అందించటం ద్వారా బ్రోకరేజీ చార్జీలు వసూలు చేస్తాయి.
వాల్యుమ్ (Volume): ఒక ట్రేడింగ్ సెషన్లో షేర్ హోల్డర్లు జరిపిన క్రయవిక్రయాలనే వాల్యుమ్ అని పిలుస్తారు. హై వాల్యుమ్ అంటే యాక్టివ్ ట్రేడింగ్ అని అర్థం చేసుకోవాలి. ‘లో వాల్యుమ్’ అంటే పరిమిత స్థాయిలో ట్రేడింగ్ జరిగిందని అర్థం.

వొలాటిలిటీ (Volatility): స్టాక్ మార్కెట్లో వొలాటిలిటీ అనే పదానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మార్కెట్ల గమనంలో ఒక్కసారిగా పెరుగుదల లేదా తగ్గుదల కనిపిస్తే ఆ సందర్భాన్ని వొలాటిలిటీగా పరిగణిస్తారు. హై వొలాటిలిటీ (High Volatility) ఏర్పడినప్పుడు షేరు ధర ఏ దిశగానైనా కదిలే వీలుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరగటం లేదా కుప్పకూలటం జరుగుతుంది. అదే విధంగా ‘లో వొలాటిలిటీ’ (Low Volatility) ఉన్నప్పుడు షేరు విలువ స్థిరంగా ఉంటుంది.
మార్కెట్ క్యాపిటలైజేషన్ (Market Capitalisation): స్టాక్ మార్కెట్లో ఏదైనా కంపెనీకి సంబంధించిన విలువను లెక్కించటంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది కీలక ప్రాత పోషిస్తుంది.కంపెనీ షేర్లు, ప్రస్తత మార్కెట్ ధర ఆధారంగా మార్కెట్ విలువను లెక్కిస్తారు. మార్కెట్ విలువ ఆధారంగానే కంపెనీలను లార్జ్-క్యాప్ (large-cap), మిడ్-క్యాప్ (Mid-Cap), స్మాల్ – క్యాప్ (Small-cap)గా వర్గీకరిస్తారు.

ఐపీఓ (IPO): ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని అర్థం. ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించే ఉద్దేశంతో కంపెనీలు షేర్లను జారీ చేయడం ద్వారా ఐపీఓకు వస్తాయి.IPO ద్వారా సమీకరించిన నిధులను కంపెనీలు తమ విస్తరణకు వినియోగిస్తాయి. ఐపీఓ తర్వాత సంస్థలు ఇన్వెస్టర్లకు జవాబుదారీగా నిలవాల్సి ఉంటుంది.
స్టాక్ స్ప్లిట్ (Stock Split): ఏదైనా కంపెనీకి సంబంధించిన ప్రస్తుత షేర్లను విభజించే ప్రక్రియనే స్టాక్ స్ప్లిట్ అని పిలుస్తారు. ఇలా చేయటం వల్ల కంపెనీ షేర్ల సంఖ్య గణనీయంగా పెరగటంతో పాటు షేరు ధర విలువ కూడా తగ్గుతుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఈ చర్య దోహదపడుతుంది. ఉదాహరణకు ఒక కంపెనీ 1:2 స్టాక్ స్ప్లిట్‌ను ప్రకటిస్తే ప్రతి ఒక షేరుకు ఇన్వెస్టర్ 2 అదనపు షేర్లను అందుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియలో కంపెనీ షేర్లు పెరిగినప్పటికీ మార్కెట్ విలువలో మార్పులుండవు.

బ్లూ చిప్ స్టాక్స్ (Blue Chip Stocks): స్టాక్ మార్కెట్లో తరచూ వినిపించే పదం ‘బ్లూ చిప్ స్టాక్స్’. ఈ క్యాటగిరీకి చెందిన స్టాక్స్ అధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ను కలిగి నమ్మదగిన రాబడులను అందిస్తుంటాయి. ఇటువంటి స్టాక్స్‌ను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, ఎంఆర్ఎఫ్ వంటి షేర్లు బ్లూ చిప్ స్టాక్స్ జాబితాలోకి వస్తాయి.
రెపో యాన్యులేజేషన్ (Repo Annualisation): Repo (రెపో) అంటే ‘రీపర్చేజ్ అగ్రిమెంట్’ అని అర్థం. రెపోను ఓ షార్ట్ టర్మ్ లోన్‌గా చూడొచ్చు. ఈ ప్రాసెస్‌లో ఒక పార్టీ తన సెక్యూరిటీని మరో పార్టీకి స్వల్పకాలిక వడ్డీ రేటుతో విక్రయిస్తుంది.రెపో రేటును వార్షికీకరించే క్రమంలో రోజువారీ వడ్డీ రేటును వార్షిక పద్ధతిలో లెక్కిస్తారు.

ఆర్బిట్రేజ్ (Arbitrage): ఆర్బిట్రేజ్ అనేది ఒక ట్రేడింగ్ వ్యూహం. ఒక స్టాక్‌ను ఒక మార్కెట్లో ఒక ధరకు కొనుగోలు చేసి మరో మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయించే వ్యూహాన్నే ఆర్బిట్రేజ్ అని పిలుస్తారు.
మార్కెట్ ఆర్డర్ (Market order): ట్రేడింగ్‌లో మార్కెట్ ఆర్డర్ అనేది ఓ నిబంధన. ఈ నిబంధన ప్రకారం ట్రేడర్ కరెంట్ మార్కెట్ ధర ప్రకారం స్టాక్స్‌ను అమ్మవచ్చు లేదా కొనవచ్చు.
లిమిట్ ఆర్డర్ (limit Order): స్టాక్ మార్కెట్లో లిమిట్ ఆర్డర్ అనేది స్టాక్‌ను నిర్దిష్ట ధరకు లేదా అంతకంటే మెరుగైన ధరకు అమ్మటం లేదా కొనుగోలు చేసే ప్రక్రియ.