కరిగిపోవటం కాలం లక్షణం.. కాలం కన్నా వేగంగా తరిగిపోవటం డబ్బు లక్షణం. మన కుటుంబ జీవితమనేది మన ఆర్థిక వ్యవహారాలపైనే ఆధారపడి ఉంటుంది. నెల మొదలై వారం రోజులు గడవక ముందే చేబదుల కోసం స్నేహితులకు మెసేజ్ చేస్తున్నారంటే మనీ మేనెజ్‌మెంట్‌లో మీరు ఫెయిల్ అవుతున్నారని అర్థం. మీ ఫోన్‌లో పరిమితికి మించి లోన్ యాప్స్ ఉన్నాయంటే ఆర్థికంగా చతికిలపడ్డారని అర్థం చేసుకోవచ్చు. ఇవి సరిదిద్దుకోలేని తప్పులేమి కావు. ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకుని పొదుపు వ్యూహాన్ని అమలు చేసినట్లయితే ఒక్కో సమస్యను షరిష్కరించుకుంటూ రావచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అప్పులు తీర్చడానికి అప్పులు చేయకండి
రుణభారం తగ్గించుకోవడానికి.. వడ్డీలు చెల్లించడానికి అప్పులు చేస్తున్నట్లయితే ఆ రుణాలు మిమ్మల్ని ఆజన్మాంతం వెంటాడే ప్రమాదముంది. అటువంటి పొరపాటే గనుక మీరు చేస్తున్నట్లయితే ఏదైనా ఆస్తిని అమ్మి అప్పుల ఊబి నుంచి బయట పడటం తెలివైన పని.
ఆదాయానికి మించి ఖర్చులు చేయకండి
ఆదాయానికి మించిన ఖర్చులు ఎప్పటికైనా ప్రమాదమే. ఆదాయాన్ని పెంచుకోవటం లేదా ఖర్చులను తగ్గించుకోవటం ద్వారా ఈ ముప్పు నుంచి బయటపడవచ్చు. పార్ట్ టైమ్ జాబ్స్ చేయటం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. క్యాబ్ డ్రైవింగ్, ఫుడ్ డెలివరీ, ఓలా, ర్యాపిడో వంటి అనేక ఆప్షన్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

ఒకరిని చూసి చేతులు కాల్చుకోవద్దు
స్నేహితుడు కొత్త కారు కొన్నాడని.. బంధువు డబుల్ బెడ్‌రూం ఫ్లాట్‌లో ఉంటున్నాడని.. మనం కూడా ఆ స్థాయిలో ఉండాలని లేనిపోని డాబులకు పోతే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పక్కవారిని కాపీ కొట్టడం మొదలుపెడితే జీవితం కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోవడం ఖాయం. ఉన్నదానిలో సరిపెట్టుకునే ప్రయత్నం చేయండి. అందులోనే ఉన్నతంగా జీవించండి. ఆర్థిక పరిపుష్టి సాధించిన తరువాత మీ కలలను సాకారం చేసుకోండి.
కీడెంచి మేలెంచండి
కుటుంబంలో సంపాదించే వ్యక్తులు దూరమైతే ఆ కుటుంబ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. ఇలాంటి సందర్భాలు తలెత్తినా ధైర్యంగా ఉండటానికి సరిపడా జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవడం ఉత్తమం.