మనకు ఏదైనా లోన్ (LOAN) మంజూరు చేయాలంటే బ్యాంకులు (BANKS) ముందుగా మన క్రెడిట్ స్కోర్ (Credit Score)ను చెక్ చెస్తాయి. క్రెడిట్ స్కోర్ (Credit Score) బాగుంటేనే బ్యాంకులు మనల్ని విశ్వసిస్తాయి. క్రెడిట్ స్కోర్‌ను సాధారణంగా క్రెడిట్ బ్యూరోలు ఇస్తాయి. క్రెడిట్ స్కోర్లను లెక్కించేందుకు ఒక్కో బ్యూరో ఒక్కో పద్ధతిని ఫాలో అవుతుంది. మన దేశంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (CIBIL), ఎక్స్పీరియన్ (Experian), ఈక్విఫాక్స్ (Equifax),, సీఆర్ఐఎఫ్ హైమార్క్ (CRIF High Mark) అనే నాలుగు బ్యూరోలు క్రెడిట్ స్కోర్‌ను నిర్ధారిస్తాయి.
క్రెడిట్ స్కోర్లను లెక్కించేటప్పుడు అన్ని క్రెడిట్ బ్యూరోలు మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే మీరు ఆర్థికంగా నమ్మదగిన వారని అర్థం. మీ క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే మీకు అప్పు ఇవ్వడం రిస్కీ అని అర్థం. బ్యాంకులతో మీ గత లావాదేవీల ఆధారంగానే క్రెడిట్ స్కోర్‌ను నిర్ణయిస్తారు. మీరు ఎటువంటి రుణ గ్రహీత అనే విషయం క్రెడిట్ స్కోర్ ఆధారంగా తెలుసుకోవచ్చు.
మీ క్రెడిట్ స్కోర్ 750కు పైగా ఉంటే మీకు లోన్లు సులభంగా వచ్చేస్తాయి. ఒకవేళ 500, అంతకన్నా తక్కువ ఉంటే మీకు లోన్ రావడం కష్టమవుతుంది.మీరు గతంలో తీసుకున్న లోన్లు, చెల్లించిన తీరు, క్రెడిట్ కార్డు వాడే విధానం, మీ అకౌంట్ బ్యాలెన్స్ మొదలైన అంశాలను క్రెడిట్ బ్యూరోలు పరిగణంలోకి తీసుకుంటాయి.