భారీగా బంగారం నిల్వలు పెంచుకుంటున్న Reserve Bank of India

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) వద్ద బంగారం (Gold) నిల్వలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచ స్వర్ణ మండలి (World Gold Council) నివేదిక ప్రకారం 2024 నవంబర్‌లో ప్రపంచంలోని అన్ని కేంద్ర బ్యాంకులు (Central Banks) కలిపి 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) 8 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది.

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో బంగారాన్ని స్థిర, భద్రమైన ఆస్తిగా ప్రపంచ దేశాలు పరిగణిస్తున్నాయి. అమెరికా ఎన్నికల ప్రభావంతో 2024 నవంబర్‌లో గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గటంతో పలు దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్ల పట్ల ఆసక్తి కనబర్చాయి. నవంబర్‌‌లో కొనుగోలు చేసిన 8 టన్నులతో కలిపి 2024లో RBI కొనుగోలు చేసిన బంగారం 73 టన్నులకు చేరుకుంది. దీంతో RBI వద్ద మొత్తం బంగారం నిల్వలు 876 టన్నులకు చేరాయి.

అగ్రస్థానంలో నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్

2024లో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసిన దేశాల జాబితాలో పోలాండ్ అగ్రస్థానంలో ఉంది. నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ (NBP) నవంబర్‌లో 21 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. 2024లో మొత్తం 90 టన్నుల బంగారం కొనుగోలు చేసిన NBP తమ దేశ బంగారం నిల్వలను 448 టన్నులకు పెంచుకుంది. ఆరు నెలల గ్యాప్ తరువాత పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) బంగారం కొనుగోళ్లను తిరిగి ప్రారంభించింది. నవంబర్‌లో ఆరు టన్నుల బంగారాన్ని చైనా కొనుగోలు చేసింది. 2024లో మొత్తం 34 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిన చైనా తమ దేశ బంగారు నిల్వలను 2,264 టన్నులకు పెంచుకుంది.

ఇదే సమయంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఉజ్బెకిస్థాన్ (Central Bank of Uzbekistan) మూడు నెలల విరామం తరువాత బంగారం కొనుగోళ్లను తిరిగి ప్రారంభించింది. ఉజ్బెకిస్థాన్ నవంబర్‌లో 9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2024లో మొత్తం 11 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఉజ్బెకిస్థాన్ తమ గోల్డ్ నిల్వలను 382 టన్నులకు పెంచుకుంది. ఇక నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజకస్థాన్ (National Bank of Kazakhstan) తన గోల్డ్ నిల్వలను రోజురోజుకు పెంచుకుంటోంది. నవంబర్‌లో 5 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిన కజకస్థాన్ తమ పసిడి నిల్వలను 295 టన్నులకు పెంచుకుంది.

2024 నవంబర్‌లో 4 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయటం ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ జోర్డాన్ (Central Bank of Jordan) తమ పసిడి నిల్వలను 73 టన్నులకు పెంచుకోగలిగింది. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ టర్కీ (Central Bank of Turkey) నవంబర్‌లో 3 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇక చెక్ నేషనల్ బ్యాంక్ (Czech National Bank) నవంబర్‌లో 3 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిన తమ నిల్వలను 50 టన్నులకు పెంచుకుంది. మరో వైపు బ్యాంక్ ఆఫ్ ఘనా (Bank of Ghana) తమ డొమస్టిక్ గోల్డ్ పర్ఛేస్ ప్రోగ్రామ్ కింద నవంబర్‌లో టన్ను బంగారాన్ని కొనుగోలు చేసి తమ నిల్వలను 29 టన్నులకు పెంచుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు గోల్డ్ కాయిన్‌ను బ్యాంక్ ఆఫ్ ఘనా విడుదల చేసింది.

నిల్వలను తగ్గించుకున్న సింగపూర్

ప్రపంచ దేశాలాన్నీ బంగారం నిల్వలను పెంచుకునేందుకు ఆసక్తి చూపుతుండగా మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మాత్రం నవంబర్‌లో తమ గోల్డ్ నిల్వలను 5 టన్నుల మేర తగ్గించుకుంది. 2024లో మొత్తం 7 టన్నుల బంగారాన్ని విక్రయించిన సింగపూర్ తమ వద్ద 223 టన్నుల బంగారం నిల్వలను అట్టిపెట్టుకుంది. ఇదే సమయంలో బ్యాంక్ ఆఫ్ ఫిన్లాండ్ (Bank of Finland) సైతం తమ గోల్డ్ నిల్వలను తగ్గించుకుంది.

బంగారం ధరలు ప్రతి రోజూ ఎందుకు మారుతుంటాయ్?

బంగారం ధర రోజురోజుకూ మారుతుంటుంది. కొన్నిసార్లు పెరుగుతుంది, కొన్నిసార్లు తగ్గుతుంది. మళ్లీ ఒక్కో రాష్ట్రంలో బంగారం ధర ఒక్కోలా ఉంటుంది. అయితే బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు? ఎవరు నిర్ణయిస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం.

వినియోగదారుడు గోల్డ్ షాప్ నుంచి బంగారం కొనుగోలు చేసే ధరను ‘స్పాట్ రేట్’ అంటారు. ఈ ధరలు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆధారంగా నిర్ణయిస్తారు. బంగారం ధరలను ప్రకటించే ముందు ఫ్యూచర్స్ మార్కెట్ లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్‌తో MCX కమ్యూనికేట్ చేస్తుంది. VAT, సుంకం, ఛార్జీలతో సహా బంగారం ధరలు MCXలో ప్రకటించబడతాయి.

దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకునే పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు దేశంలో బంగారం దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం బంగారం ధరపై కనిపిస్తుంది. బంగారాన్ని ఎగుమతి చేసే దేశాలన్నీ వాటి ఉత్పత్తిని తగ్గించుకుంటే బంగారం ధరలు భారీ పెరిగే అవకాశముంటుంది.

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర ఎంత ఉండాలనేది లండన్ బులియన్ మార్కెట్ నిర్ణయిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బులియన్ మార్కెట్. 2015కి ముందు లండన్ గోల్డ్ ఫిక్స్ బంగారం ధరను నిర్ణయించేంది. 2015 తరువాత నుంచి లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ బంగారం ధరలను నిర్ణయిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *